
అమరావతి, 1 నవంబర్ (హి.స.)కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల నుంచి ఒక బోటు ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది.
వెంటనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ స్వయంగా స్పందించారు. SDRF బృందం, డ్రోన్ యూనిట్‌లతో సమన్వయం చేసుకుని ఆపరేషన్ ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో నదిని స్కాన్ చేస్తూ తుమ్మలపాలెం సమీపంలో ఆ బోటును గుర్తించారు. SDRF, గజ ఈతగాళ్లు వేగంగా అక్కడకు చేరుకుని బోటును ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ప్రవాహం ఉధృతిగా ఉన్న సమయంలో బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొడితే గేట్లకు భారీ నష్టం జరిగేది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు గేట్ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది బుడమేరు వరదల్లో ఇలాంటి సంఘటన కారణంగా గేట్లలో చిక్కుకున్న బోటును తొలగించేందుకు ఏకంగా ఎనిమిది రోజులు సమయం పట్టింది. టెక్నాలజీ వినియోగం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ వ్యవస్థ ఆధునిక టెక్నాలజీతో సిద్ధమవుతోంది. డ్రోన్లు, రియల్‌టైమ్ మానిటరింగ్, జియో ట్యాగింగ్ వంటి సాంకేతిక పద్ధతులు విపత్తుల సమయంలో సకాలంలో చర్యలు తీసుకునేలా సహాయపడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV