
ముంబై, 12 నవంబర్ (హి.స.)
ఆరోగ్య సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ధర్మేంద్రకు చికిత్స అందిస్తున్న వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సమదానీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ .. “ధర్మేంద్ర ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబం నిర్ణయం మేరకు ఆయనకు ఇంటి వద్దే చికిత్స కొనసాగించనున్నాం” అని పీటీఐకి తెలిపారు.
ఇక ధర్మేంద్ర కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చారు. ధర్మేంద్ర గారు క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మీడియా, ప్రజలు ఎటువంటి ఊహాగానాలు లేదా తప్పుడు ప్రచారం చేయకూడదు. మా కుటుంబ ప్రైవసీని గౌరవించాలని మనవి చేస్తున్నాం” అని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..