
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఇస్తున్న తీర్పుతో తమ ప్రభుత్వం మరింత పకడ్బందీగా పని చేస్తుందని అన్నారు. రిగ్గింగ్ చేశారని ప్రచారం జరుగుతున్నా, ఆశించిన స్థాయిలో ఆధిక్యం ఎందుకు రాలేదని ప్రశ్నించగా.. ప్రజాస్వామ్యంలో ఇంత పకడ్బందీగా ఎన్నికలు జరుగుతున్నాయని, అందులోనూ హైదరాబాద్లో ఆ పరిస్థితి ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు మాకు అండగా ఉన్నారని తెలిపారు.
జూబ్లీ హిల్స్ గెలుపు తాము ఊహించినదే అని, మెజారిటీ విషయంలో కాస్త అటూ ఇటూ అయిందని అన్నారు. ఏది ఏమైనా, ప్రజలు మరోసారి తమవైపే ఉన్నారనే విషయం స్పష్టమైందని, ఇక ముందు మరింత బాధ్యతతో పని చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు