
అమరావతి, 14 నవంబర్ (హి.స.): బిహార్ ఎన్నికల్లో విజయంతో ఎన్డీయే, నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోమారు రుజువైందని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భారత దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన మోదీతోనే సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న నీతీశ్ కుమార్ పట్ల ఆ రాష్ట్ర వాసులకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. బిహార్‌లో విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరచి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకువెళ్లారని కితాబిచ్చారు. ఈ విజయానికి కృషి చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా , బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఉప ఎన్నికలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు