
శ్రీకాకుళం, 2 నవంబర్ (హి.స.)
శ్రీకాకుళం కాశిబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయం, వందల ఏళ్ల నాటి చరిత్రేమీలేదు. కేవలం 6నెలల కిందటే ఓపెన్ అయిన ఆలయం. ఒక ప్రైవేట్ టెంపుల్. తిరుమల రెప్లికాతో నిర్మించి, శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితమైన క్షేత్రం. ఇప్పుడిప్పుడే స్థానికంగా జనం నోళ్లలో నానుతున్న గుడి. తిరుమల తరహాలోనే గోపురం, గర్బగుడి ఉండడంతో భక్తులను ఆకట్టుకుంది. కానీ అతి తక్కువ కాలంలో ఇంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం కూడా ఉంది.
హరిముకుంద పండా…95ఏళ్ల వృద్ధుడు. పదేళ్ల కిందట శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. క్యూలైన్లో నిల్చోలేక అక్కడున్న సిబ్బంది స్వామి దర్శనానికి అనుమతించకపోవడంతో, నిరాశతో వెనుదిరిగివచ్చాడు. అప్పుడు తానే శ్రీవారికి ఆలయం కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబానికి చెందిన కొబ్బరి తోటల్లో తిరుమల రెప్లికా ఆలయాన్ని నిర్మించాడు. 2019లో ప్రారంభమైన గుడి నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంకా పూర్తి కాలేదు. తిరుమల ఆనంద నిలయం తరహాలో గోపురం ఏకశిల విగ్రహాలతో నిర్మించారు. శ్రీవేకంటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి నవగ్రహాలు, సకల దేవతా మూర్తులు కూడా ఉన్నాయి. ఒక కోనేరు కూడా నిర్మించారు. టీటీడీ నిర్మించిన ఆలయానికి కూడా రాని ప్రచారం ఈఆలయానికి అతి తక్కువ కాలంలో వచ్చింది., కారణం. ఆలయం నిర్మించిన పండాకు స్థానికంగా మంచి పేరు ఉండటం.
స్వామివారి మీద భక్తితో హరిముకుందన్ పండా ఆలయం నిర్మించారు సరే. కానీ నియమాలు ఆలయ నిర్వాహకులు పాటించారా..? ఆలయ నమూనాల విషయంలో యాక్ట్ ఏం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్,1987 లో ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఈ యాక్ట్ కొత్త ఆలయాల స్థాపన, రిజిస్ట్రేషన్, నిర్వహణ, ట్రస్టీల నియామకం, ఆస్తులకు సంబంధించి స్పష్టమైన నియమాలను సూచించింది. రెప్లికా నిర్మాణం కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది. ప్రైవేట్ ఆలయాలైనా ఎండోమెంట్ యాక్ట్ అనుగుణంగానే నిర్మించాలంటున్నారు అధికారులు. అయితే కాశిబుగ్గ ఆలయం విషయంలో నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ భక్తుల భద్రతపై దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. ఇంకా నిర్మాణ దశలోనే ఆలయం ఉండటం కూడా భక్తుల మరణానికి కారణమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మరి కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV