
పాట్నా, 2 నవంబర్ (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. జన సురాజ్ పార్టీ కార్యకర్త దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో జేడీయూ అభ్యర్థి, వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను పాట్నా పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
పాట్నా ఎస్ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం బార్‌లోని ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సంబంధం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురినీ త్వరలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.
గురువారం మోకామాలో జన సూరాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరఫున ప్రచారం చేస్తుండగా దులార్‌చంద్ యాదవ్ మరణించారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ కాల్పుల వల్ల ఆయన చనిపోలేదని, పక్కటెముకలు విరగడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే మరణించారని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ఈ ఘటనతో బీహార్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి రాజుకుంది.
పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ దులార్‌చంద్ యాదవ్ హత్య కేసుకు సంబంధించి అనంత్ సింగ్, మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్‌లను అరెస్ట్ చేశాం. ప్రాథమిక విచారణ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చాం అని తెలిపారు. ప్రత్యర్థి వర్గాల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత యాదవ్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆయన వివరించారు. ఘటన జరిగినప్పుడు అనంత్ సింగ్ తన అనుచరులతో అక్కడే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ అరెస్టుపై జన సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి స్పందిస్తూ.. ఇది మంచి పరిణామమే అయినా, పోలీసులు ముందుగానే చర్య తీసుకుని ఉంటే బాగుండేది. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఆయన 50 వాహనాల కాన్వాయ్‌తో ప్రచారం చేశారు. ఆలస్యమైనా సరైన చర్యే. ఇప్పుడు పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారన్నదే ముఖ్యం అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV