పన్నులు తగ్గినా పెరిగిన ఏపీ జీఎస్‌టీ ఆదాయం.. అక్టోబర్‌లో 8.77శాతం వృద్ధి
అమరావతి, 2 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 అక్టోబర్ నెలకు గాను నికర జీఎస్టీ వసూళ్లలో 8.77 శాతం పెరుగుదల కనిపించింది. వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్ వంటి పలు కీలక వస్తువులపై పన్ను రేట్ల
ap-gst-revenue-increased-despite-tax-cuts


అమరావతి, 2 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 అక్టోబర్ నెలకు గాను నికర జీఎస్టీ వసూళ్లలో 8.77 శాతం పెరుగుదల కనిపించింది. వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్ వంటి పలు కీలక వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ ఈ స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హం.

రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అక్టోబర్ నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,021 కోట్లుగా నమోదయ్యాయి. ఇది అక్టోబర్ నెల వసూళ్లలో ఇప్పటివరకు రెండో అత్యధికం. ఇక స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,490 కోట్లకు చేరాయి. రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్జీఎస్టీ) రూపంలో రూ.1,247 కోట్లు (6.2 శాతం వృద్ధి), ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ ద్వారా రూ.1,773 కోట్లు (10.65 శాతం వృద్ధి) సమకూరాయి. వీటితో పాటు పెట్రోలియం వ్యాట్ ద్వారా రూ.1,282 కోట్లు, వృత్తిపన్ను ద్వారా 18.26 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, పటిష్టమైన పన్నుల అమలు విధానాల వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) క్లెయిమ్‌లను అరికట్టడం, బకాయిదారులపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం, వారి ఆస్తులు, బ్యాంకు ఖాతాల నుంచి పన్నులు వసూలు చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే రూ.279 కోట్ల తప్పుడు ఐజీఎస్‌టీ క్రెడిట్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande