
మదనపల్లె, 6 డిసెంబర్ (హి.స.)
:ఒకప్పుడు గంజాయి సరఫరా, వినియోగం రెండూ పరిమితంగా, అందులోనూ రహస్యంగా ఉండేది. ఇటీవల విచ్చలవిడి అయిపోయింది. దీని మత్తులో యువత.. సహచరులు, స్నేహితులతో మాటల సందర్భంలో దాడులు, దౌర్జన్యాలకు కూడా దిగుతోంది. ఈ నేపథ్యంలో మత్తు మహమ్మారి నియంత్రణ, నిర్మూలనను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో వైసీపీ పాలనలో బీజం పడిన గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారు.
ఇందులో భాగంగా ఇటీవల మదనపల్లె ఏరియాలో దాడులు నిర్వహించి, సుమారు వంద మందిని పట్టుకోవడంతో చర్చనీయాంశమైంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతమైన ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి అవుతోంది. తిరుపతి కేంద్రంగా మదనపల్లెకు సరఫరా చేస్తుండగా, ఇక్కడి నుంచి తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఏరియాలకు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో కొందరు యువత, పనులు లేకుండా ఖాళీగా ఉంటున్న ఆకతాయిలను గంజాయి సరఫరాలోకి దిగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ