
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన అల్లూరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన తెలంగాణ విద్యార్థులను చింతూరు వద్ద గ్రామస్థులు అడ్డుకోవడంతో కొద్దిగంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. హిడ్మా ఎన్‌కౌంటరుపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటనలోని నిజానిజాలు తెలుసుకునేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన 12మంది విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి శుక్రవారం ఏపీకి వచ్చారు. ఘటన జరిగిన మారేడుమిల్లి ప్రాంతానికి చింతూరు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చింతూరులో వారి వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్డుపైనే మావోయిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల వాహనం కదలకుండా అడ్డుగా నిలబడి, వారితో వాగ్వాదానికి దిగారు. ‘‘మావోయిస్టులు చనిపోతే నిర్ధారణ కమిటీ అంటూ వచ్చారు. మరి.. అదే మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల పేరిట హత్యలుచేస్తే ఎందుకు స్పందించడం లేదంటూ విద్యార్థులను నిలదీశారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారారంటూ రోడ్డు మీదే ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న చింతూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థులను, వారి వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ