
వరంగల్, 8 డిసెంబర్ (హి.స.) బేటీ బచావో- బేటీ పడావో అంటూ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బాలికల భద్రత విషయంలో ఏం చేస్తుందంటూ వరంగల్ ఎంపీ కడియం కావ్య లోకసభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఒడిశాకు చెందిన ఒక దళిత మహిళా, తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ చదువుతున్న విద్యార్థినిని అవమానకరంగా వేధింపులకు గురిచేయడంతో ఆమె చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో డా. కావ్య లేవనెత్తారు. దేశంలోని విద్యాసంస్థల్లో బాలికలు, మహిళా విద్యార్థులపై ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బేటీ పడావో అన్న నినాదం పాఠశాల గోడలకే పరిమితమా? విద్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులకు రక్షణ ఎక్కడ? అని కావ్య కేంద్రాన్ని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు