
ఎర్నాకులం, 9 డిసెంబర్ (హి.స.)
కేరళ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ (Local body election polling) ప్రక్రియ ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భాగంగా, నేడు తొలి విడతలో 7 జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ తొలి విడతలో దాదాపు 1.32 కోట్ల మంది ఓటర్లు 36,630 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి.
ఈ ఎన్నికలను 2026 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తుండటంతో అధికార ఎల్‌డిఎఫ్ (LDF), ప్రతిపక్ష యుడిఎఫ్ (UDF), ఎన్‌డిఎ (NDA) కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిపి మొత్తం 11,168 వార్డులకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచారు. ఇక మిగిలిన జిల్లాలకు రెండో విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా, డిసెంబర్ 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా కేంద్ర మంత్రి సురేష్ గోపి (Union Minister Suresh Gopi) ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక ఓటర్లతో కలిసి క్యూలైన్ లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV