
తిరుపతి, 9 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలోని వివిధ జిల్లాలో నానాటికి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు రహదారి భద్రతపై ఆందోనలను కలిగిస్తున్నాయి. ఉదయం వేళ విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలోని తీపర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లాలోని నగరి తడుకుపేట (Nagari Tadukupeta) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం శంకర, సంతానం అనే ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా పని చేస్తున్నారు. నగరి మీదుగా మరో ప్రాంతానికి వారు కారులో ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారుని వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోటు కార్మికులుగా పని చేస్తున్న శంకర, సంతానంతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడువాసులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV