సంగారెడ్డి, 19 జూలై (హి.స.)
వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేలా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ లో 14వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెమీ కండక్టర్ల అభివృద్ధిలో భారత్ టాప్ 5 లో నిలిచిందని, కొత్తగా ఏఐ కోష్ కూడా ప్రారంభించడం ద్వారా 880 డేటా సెంటర్ల ద్వారా 200 పైగా మోడల్స్ ను తయారు చేయడం అభినందనీయమన్నారు. టెలికాం రంగంలో అగ్రగామిలో నిలిచేలా దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా టవర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో భాగంగా ప్రతి ఒక్కరికి వాటిని చేరువ చేసే దిశగా వంద 5g ల్యాబ్ లను ఏర్పాటు చేశామన్నారు. రైల్వే శాఖకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1300 పురాతన రైల్వే స్టేషన్లను కూల్చి తిరిగి వాటిని అధునాతన పరుస్తున్నట్లు వివరించారు.
అందులో సికింద్రాబాద్లోని చర్లపల్లి స్టేషన్ కూడా ఉందన్నారు. 2027 కల్లా ఎవరు ఊహించని విధంగా దేశంలో సరికొత్త టెక్నాలజీ తో బుల్లెట్ ట్రైన్ పట్టాలు ఎక్కనున్నట్లు ఆయన వెల్లడించారు. 2047 నాటికల ప్రపంచ పటంలో భారత్ ఒక కొత్త మార్పుతో అగ్రగామిలో నిలవడం ఖాయమని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు విద్యార్థి స్థాయి దశ నుంచి కష్టపడి దేశాన్ని అగ్రగామిలో నిలిచేలా తమ వంతు కృషి చేయాలని విద్యార్థులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఐఐటీ హైదరాబాదులో విద్యాభ్యాసం పూర్తి చేసిన 1250 వివిధ శాఖల విద్యార్థులకు ఆయన గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..