హైదరాబాద్, 19 జూలై (హి.స.)
నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా... స్ట్రీట్ ఫైట్ రాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం రాదన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు శామీర్పేటలోని ఈటల నివాసానికి తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం మమ్మల్ని దూరం పెడుతున్నారని, పార్టీ పదవుళ్లలో అవకాశం ఇవ్వడం లేదని వారు ఈటల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాలం చాలా గొప్పదన్నారు. బాజాప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదనీ, హుజురాబాద్ చైతన్యానికి మారుపేరన్నారు.
మనకు మనంగా బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదనీ వెళ్లగొట్టారనీ తెలిపారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి.. తట్టుకున్నాం 2021 నుండి బీఆర్ఎస్లో నరకం అనుభవించానని గుర్తు చేశారు. కానీ ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశాడో... అర్థం అవుతుందని తెలిపారు.
తాను శత్రువుతో నేరుగా కోట్లాడతానని ఈటల స్పష్టం చేశారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం రాదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదనీ, నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అని, ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు అని రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజురాబాద్లో గత 20 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ ఓడిపోలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..