తెలంగాణ, 19 జూలై (హి.స.)
మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం ఆధునీకరణ పనుల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం సచివాలయం లో సమ్మక్క సారక్క ఆలయం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పూజారుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మ ల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసరాల్లో ఆధునీకరణ పనులు చేయనున్నట్లు వివరించారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, మీడియా కోసం అదనపు వసతులు కల్పించేలా ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు