తెలంగాణ,యాదగిరిగుట్ట, జూలై19. (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శీఘ్రంగా దర్శించుకునేందుకు రూ.5 వేలతో గరుఢ టికెట్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. గరుఢ టికెట్ ను తీసుకునే భక్తుడికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ వేళ వరకు ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలును కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ టికెట్ తో స్వామివారి అంతరాలయ ప్రవేశం కల్పించడంతో పాటు స్వామివారి వేదాశీర్వచనం, 5 లడ్డూలు, కేజీ పులిహోర, కొండపైకి వాహన అనుమతి ఉంటుందన్నారు. ఒక భక్తుడికి ఒక టికెట్గా నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి రాగానే అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.
దేవస్థాన ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్ సంస్థ తరఫున యాదగిరి ఆధ్యాత్మిక తెలుగు మాస పత్రిక, టీవీ చానల్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు