దిల్లీ, 20 జూలై (హి.స.) కాంగ్రెస్‌తో విభేదాల వేళ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అంశపై కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్నింటికంటే దేశమే ముందుండాలని, పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమేనని చెప్పారు. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని నొక్కి చెప్పారు.
మీ మొదటి విధేయత ఏమిటన్న ప్రశ్నకు థరూర్ బదులిస్తూ తన దృష్టిలో దేశమే ముందని, పార్టీలు దేశాన్ని మెరుగుపరిచే సాధనాలు మాత్రమేనని చెప్పారు. ఏ పార్టీకి చెందిన వారైనా పార్టీ లక్ష్యం సొంత మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేనని అన్నారు. ఆపరేషన్ సిందూర్, దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ప్రధానమంత్రి మోదీకి మద్దతు ఇవ్వడంపై తాను ఎదుర్కొన్న విమర్శలను ప్రస్తావిస్తూ.. మన సాయుధ దళాలకు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తాను తీసుకున్న వైఖరిపై చాలామంది తనను విమర్శించారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ తాను తన వైఖరికే కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎందుకంటే దేశానికి ఇది సరైనదని తాను నమ్ముతానని చెప్పారు.
కాంగ్రెస్ నాయకత్వంతో థరూర్‌కు ఉన్న బంధంపై ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమ పార్టీలో కొన్ని విలువలు, నమ్మకాలు ఉన్నాయని, కానీ జాతీయ భద్రత దృష్ట్యా తాము ఇతర పార్టీలకు సహకరించాలని, అయితే, కొన్నిసార్లు పార్టీలు అది తమకు నమ్మక ద్రోహంగా భావిస్తాయని, అప్పుడు సమస్యగా మారుతుందని వివరించారు.
ఏ ప్రజాస్వామ్యంలోనైనా రాజకీయాల్లో పోటీ అనివార్యంగా ఉంటుందని, కానీ క్లిష్టమైన సమయాల్లో కలిసి పనిచేయడానికి అది అడ్డురాకూడదని ఆయన అన్నారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలను కూడా నమ్ముతానని ధరూర్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి