న్యూఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ మహా ధర్నాకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడొద్దని కామెంట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగులకు, విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం ఢిల్లీలో మాత్రం మోకాలడ్డుతోందని ఫైర్ అయ్యారు. ఇక ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో కాదు.. ఢిల్లీలో కవిత ధర్నా చేయాలని హితవు పలికారు. బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కానీ, ఆమె పొలిటికల్ డ్రామాలకు తెర లేపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్