నెల్లూరు, 6 ఆగస్టు (హి.స.)
: నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను కచ్చితంగా కూల్చివేస్తామని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు. వెంకట రామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించి మూడు భవనాల్లో నిర్మించిన అదనపు అంతస్తులను టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికార నిర్మాణాల తొలగింపునకు గతంలోనే నోటీసులు జారీ చేసి, కూల్చివేత ఆదేశాలను కూడా యజమానులకు అందజేశామని తెలిపారు. భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా నిర్మాణాలని తొలగించుకుంటామని తెలిపి, నిర్దేశించిన సమయానికి తొలగించలేదన్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని చెప్పారు. పట్టణ ప్రణాళిక విభాగం మార్గదర్శకాలలో భవన నిర్మాణ యజమానుల సౌలభ్యం దృష్ట్యా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, వాటిని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను చేపట్టాలని కమిషనర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ