దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)భారత్ లాంటి మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బ తీసుకోకూడదని రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) సూచించింది. ఇండియా తమకు మంచి భాగస్వామి కాదంటూ, దానిపై భారీగా సుంకాలను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిక్కీ హేలీ ఇరుదేశాల సంబంధాలపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి.
అయితే, రష్యా (Russia) నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయకూడదు.. కానీ, చైనా చేయొచ్చా అని డొనాల్డ్ ట్రంప్ ను రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ప్రశ్నించింది. రష్యా నుంచి చైనా (China) అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తుందని గుర్తు చేసింది. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజుల పాటు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ.. భారత్ లాంటి మిత్రదేశాన్ని దూరం చేసుకోవద్దని వెల్లడించింది. ఇక, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో యూఎస్ రాయబారిగా పని చేశారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె.. ఆ తర్వాత ట్రంప్‌కు సపోర్టు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ