న్యూఢిల్లీ, 7 ఆగస్టు (హి.స.)
తాజాగా బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పుట్టిస్తున్నాయి. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తేనే.. తాను తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తానే స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడుతానని ప్రకటించారు.
ఈ క్రమంలోనే కిషన్రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ చట్ట సభల్లో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నాడు అసెంబ్లీ సాక్షిగా బిల్లులకు మద్దతునిచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు.. నేడు ఢిల్లీలో మొహం చాటేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొత్తగా తీసుకొచ్చినవి కాదని.. స్వాతంత్య్రానికి ముందు నుంచి కూడా ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్లు అంశం కేంద్రం పరిధిలో లేవని కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రాసివ్వగలరా అని ప్రశ్నించారు. మీ దగ్గర జోలె పట్టుకొని రావాల్సిన అవసరం తమకు లేదని.. తామిచ్చే రిజర్వేషన్లు అన్ని బీసీలకే చెందుతాయని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..