బ్రహ్మపురం, 7 ఆగస్టు (హి.స.)
, : పెద్దబజారు ఠాణా పరిధిలోని ఉత్కళ కూడలి సమీపాన శాస్త్రినగర్‌లో మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తూటా ఇంటి యజమాని బాలకృష్ణ ఆచారికి తగలడంతో గాయపడ్డాడు. దుండగులతో జరిగిన తోపులాటలో ఆచారి సమీప బంధువు గాయపడ్డాడు. ఇద్దరినీ చికిత్స కోసం ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చేర్పించారు. బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. రాత్రి ఎమ్కేసీజీ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఓ ఖరీదైన వజ్రం కోసం ఈ కాల్పులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎస్పీ శరవణ వివేక్ బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో విలేకరులకు ఆ వివరాలు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.20 లక్షల విలువైన వజ్రాన్ని విక్రయించేందుకు బాలకృష్ణ ఆచారిని సంప్రదించాడు. ఆయన గంజాం జిల్లా అస్కాకు చెందిన మళయ ఉపాధ్యాయ అనే వ్యక్తిని సంప్రదించాడు. దీనిపై మంగళవారం సాయంత్రం విశాఖకు చెందిన వజ్రాల వ్యాపారి, మళయ ఉపాధ్యాయ కలిసి బాలకృష్ణ ఆచారి ఇంట్లో ఆయనతో సమావేశమయ్యారు. వజ్రం కొనుగోలుదారుల్ని పిలుస్తానని మళయ ఉపాధ్యాయ వారికి చెప్పారు. కొంతసేపటి తర్వాత గుర్తు తెలియని కొందరు అక్కడికి వచి, వజ్రం తీసుకొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బాలకృష్ణ ఆచారి గుర్తు తెలియని వారితో వాగ్వాదానికి దిగాడు. తోపులాట చోటుచేసుకుంది. వచ్చినవారిలో ఒకడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనకు వజ్రమే కారణమా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఎస్పీ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ