కోచ్చిన్, 7 ఆగస్టు (హి.స.)వెండితెరపై అమ్మగా, అత్తగా ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి ప్రగతి, ఇప్పుడు క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. నటనకే పరిమితం కాకుండా, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ 50 ఏళ్ల వయసులో జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కేరళ వేదికగా జరిగిన 'నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025'లో ప్రగతి పాల్గొన్నారు. ఈ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. అంతేకాకుండా మరో రెండు విభాగాల్లోనూ పతకాలను గెలుచుకుని తన సత్తా చాటారు. గతేడాది జరిగిన సౌత్ ఇండియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ఆమె, ఈసారి ఏకంగా జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచి తన పట్టుదలను నిరూపించుకున్నారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రగతి.. స్క్వాట్‌లో 115 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 50 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 122.5 కిలోల బరువులను ఎత్తి తన శారీరక ధారుడ్యాన్ని ప్రదర్శించారు. మూడు పతకాలు సాధించిన ఆనందాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అభిరుచి, క్రమశిక్షణే నా విజయానికి కారణం. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నా కోచ్ కౌశిక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు.
50 ఏళ్ల వయసులోనూ ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడుతూ 'హ్యాట్సాఫ్' అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి