అమరావతి, 7 ఆగస్టు (హి.స.)ఇవాళ(ఆగస్టు 07) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న కుటుంబాలకు ఏపీసీసీ వైఎస్ షర్మిల చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి వారసత్వానికి చిహ్నం మన చేనేత అని పేర్కొన్నారు. నిండైన భారతీయతకు, మన అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే నేతన్నల సంక్షేమానికి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది ముమ్మాటికీ మోసమే అని ఆమె ఆరోపించారు. చేనేత సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పి.. ముష్టి రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణం అన్నారు.
చేనేత వస్త్రాల మీద 5 శాతం GST మోపి నేతన్నలకు కేంద్రం వెన్నుపోటు పొడిస్తే.. ప్రతి మగ్గానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి .. ఇప్పుడు సగానికి సగం మగ్గాలకు కోతపెట్టి సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 1.70 లక్షల మగ్గాలు ఉంటే కేవలం 62 వేల మగ్గాలకు మాత్రమే.. ఉచిత కరెంటు ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గపు చర్య అని ఆమె భావించారు. ఎన్నికల్లో చేనేతల కోసం ఇచ్చిన 25 హామీలు కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. చేనేత సంక్షేమాన్ని విస్మరించింది. చేనేత వస్త్రాల మీద GST రీయింబర్స్ మెంట్ కాదు.. మొత్తం రద్దు చేయాలి. రాష్ట్రంలో చేనేత సహకార వ్యవస్థలను బలోపేతం చేయాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి