పోలీస్ ఉద్యోగాల పేరిట నకిలీ ప్రకటన.. అప్రమత్తం చేసిన సీపీ సజ్జనార్
పోలీస్ ఉద్యోగాల పేరిట నకిలీ ప్రకటన.. అప్రమత్తం చేసిన సీపీ సజ్జనార్
సజ్జనార్


హైదరాబాద్, 21 మే (హి.స.)

సోషల్ మీడియాలో నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. తాజాగా 'హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో బంగారు ఉద్యోగ అవకాశాలు' అంటూ నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటన తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా క్లీనర్లు, ఆఫీస్ సహాయకుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆకట్టుకునేలా ఆ ప్రకటనను రూపొందించారు. నెలకు 18,000 నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుందని ఊరించారు. అయితే, ఈ ప్రకటన పూర్తిగా అవాస్తవమని, దీనిపై ఎవరూ స్పందించవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సజ్జనార్ ఒక పోస్ట్ చేస్తూ నిరుద్యోగులను హెచ్చరించారు. వైరల్ అవుతున్న నకిలీ ప్రకటనపై 'ఫేక్ (FAKE)' అని ముద్రించిన ఫోటోను ఆయన షేర్ చేశారు.

హైదరాబాద్ పోలీసుల రిక్రూట్మెంట్ పేరుతో కొందరు మోసపూరిత ప్రకటనను ప్రచారం చేస్తున్నారు. దయచేసి ధృవీకరించుకోకుండా ఇలాంటి పోస్ట్లను ఎవరూ నమ్మవద్దు, ఇతరులకు షేర్ చేయవద్దు. అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలి. హైదరాబాద్ పోలీసు శాఖకు సంబంధించిన ఎలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయినా మా అధికారిక మార్గాల (వెబ్సైట్లు, పత్రికా ప్రకటనలు) ద్వారా మాత్రమే ప్రకటిస్తాము.. అని సజ్జనార్ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మి ఎవరికీ డబ్బులు చెల్లించవద్దు. మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు. ముఖ్యంగా గుర్తుతెలియని లింక్లపై అసలే క్లిక్ చేయవద్దు. ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసే ముందు, ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నిజమైనదా కాదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. నకిలీ ఉద్యోగాల కుంభకోణాల బారిన పడి మోసపోవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande