
తిరుపతి, 21 మే (హి.స.) సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాల్లో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం చేపడుతున్న భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నష్టపరిహారం అందజేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, విద్యార్హత కలిగిన రైతుల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ రోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రైతులతో భూసేకరణ, నష్టపరిహారం, ప్రభుత్వ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
రైతులకు న్యాయం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాల్లో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా రైతులకు న్యాయమైన పరిహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. భూములకు ఎకరాకు రూ.28 లక్షల పరిహారం చెల్లించడమే కాకుండా భూముల్లో ఉన్న మామిడి చెట్లు, ఇతర వృక్షాలు, బోర్వెల్లు, షెడ్లు, గోడలు, కట్టడాలు వంటి స్థిరాస్తులకు ప్రత్యేక అంచనాల ప్రకారం అదనపు పరిహారం కూడా చెల్లిస్తామని కలెక్టర్ వెల్లడించారు. భూ పరిహారం, అదనపు పరిహారం కలిపి రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
శ్రీ సిటీ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని కలెక్టర్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాలు గతంతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు, మౌలిక వసతులు ఏర్పడి ప్రాంతీయ అభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. గతంలో కూడా రైతులు సహకరించి శ్రీ సిటీ అభివృద్ధికి భూములు ఇచ్చారని, ఆ సహకారంతోనే ప్రస్తుతం రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా శ్రీ సిటీ ఎదిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా రైతులు సహకరిస్తే భవిష్యత్తులో వారి పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV