
హైదరాబాద్, 21 మే (హి.స.)
పంటల కొనుగోళ్లలో నెలకొన్న తీవ్ర సంక్షోభం, రైతుల అవస్థలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు ప్రభుత్వం పడుతున్నా పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఎల్లుండి జరగబోయే కేబినెట్ మీటింగ్లోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డారని ఆరు దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగుచేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టిందని దుయ్యబట్టారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలుచేసిన ఒక్కో పథకానికి గత రెండేన్నరేళ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్నువిరిచారని మండిపడ్డారు.
ఇవాళ మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయని అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్థనాదాలు చేస్తున్నారు. చేతకాని మీ సర్కారు నిర్వాకం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలన చూసినా ఈరోజు రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారుని ఆరోపించారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలుతున్నా మీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. 70 సార్లు ఢిల్లీకి వెళ్లిన శ్రద్ధ రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదని విమర్శించారు.
చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు మీరు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయండి. అన్నదాతలు అడుగడుగడునా పడిగాపులు పడుతుంటే వాటిని వదిలేసి, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలన్న మీ సర్కారుకు ప్రాధాన్యతలే కాదు, చివరికి సోయి కూడా లేదని తేలిపోయిందని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..