
నాగర్ కర్నూల్, 21 మే (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట
వరి నియోజకవర్గం పరిధిలోని లింగాల మండల కేంద్రంలో పలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మొక్కజొన్న, కొనుగోళ్లకు రైతులకు అందుతున్న సేవలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, గ్రామ స్థాయిలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమంపై ప్రత్యక్షంగా పరిశీలించి, వివరాలను సేకరించి, సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ముందుగా లింగాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధానం, తూకం ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా తక్షణమే వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా సరైన ప్రణాళికతో కొనుగోళ్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ధాన్యం తరలింపు ప్రక్రియకు అవసరమైన లారీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, రైతులు ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు