పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల వినూత్న నిరసన
పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల వినూత్న నిరసన
పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల వినూత్న నిరసన


శ్రీ సత్య సాయి, 21 మే (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు తమ పెండింగ్ వేతనాల కోసం చేపట్టిన నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు మంగళవారం వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు.

మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ “మా మొర ఆలకించండి మహాప్రభో… పెండింగ్ జీతాలు చెల్లించండి” అంటూ ప్రభుత్వానికి వేడుకున్నారు. కొత్తచెరువులో కొనసాగుతున్న ఈ నిరసన కార్యక్రమం గురువారంతో 17వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల బాధలను పూర్తిగా మరిచిపోతున్నారని విమర్శించారు. గ్రామ గ్రామానికి తాగునీరు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న తమ పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు.

సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ప్రజలకు అవసరమైన తాగునీటి సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలను మాత్రం చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా జీతాలు అందక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఇంటి ఖర్చులు నెట్టుకురావడం కష్టమైందని వాపోయారు. అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అప్పులు తీర్చలేక ఆర్థికంగా కుంగిపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబాల్లో చిన్నపిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అవసరాలు అన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయని కార్మికులు తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే “చలో అమరావతి” కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనకు స్థానిక ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande