అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు
అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు
Suvendu Adhikari


కలకత్తా 21 మే (హి.స.)పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ... రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ విడుదల చేసిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే, అలాగే గుర్తింపు పొందిన అన్ని రకాల మదర్సాలు, ఎంఎస్కే, ఎస్ఎస్కే సంస్థలలో రోజువారీ తరగతులు ప్రారంభమయ్యే ముందు నిర్వహించే ప్రార్థనా సమావేశాల్లో ఈ జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సి ఉంటుంది. గతంలో అమలులో ఉన్న అన్ని పాత పద్ధతులను, ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ ఏకరీతి విధానాన్ని తక్షణమే అమలులోకి తీసుకువచ్చారు.

రాష్ట్ర మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సంతాలి భాషలో బోధన జరుగుతోందని, అక్కడ కూడా “వందేమాతరం” గీతాన్ని విజయవంతంగా ఆలపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. కాబట్టి మదర్సాలలో దీనిని అమలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, ఇది కేవలం జాతీయవాదం, విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు ఉద్దేశించిన అంశమని స్పష్టం చేశారు.

ఇటీవలే మే 13న రాష్ట్ర విద్యాశాఖ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'వందేమాతరం' తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడు పాఠశాలలతో పాటు మదర్సాలలోనూ ఈ నిబంధనను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలో ఒకే రకమైన ప్రార్థనా విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande