
హైదరాబాద్, 22 మే (హి.స.)
రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆయనతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడటంతో పాటు, రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తుల చిట్టా వెలుగుచూసినట్లుగా సమాచారం.
గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవో, ఎమ్మార్వోగా బాధ్యతలు నిర్వర్తించిన వంశీ మోహన్.. ఆ సమయంలో తన పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొట్టేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని పిగ్లీపురంలో ఏకంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ భూమిని తన మామ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ఓ బడా రియల్టర్కు దారాదత్తం చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుంచి 10 ప్లాట్లను 'గిఫ్ట్ డీడ్' రూపంలో తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..