
దిల్లీ 22 మే (హి.స.)వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారత పర్యటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముందుగానే ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ విధానానికి సంబంధించిన సమాచారం అమెరికా వేదికల నుంచి బయటకు రావడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.
'2025 మే 10న సాయంత్రం 5:37 గంటలకు ఆపరేషన్ సిందూర్ను నిలిపివేస్తున్నట్లు మొదట ప్రకటించింది కూడా రూబియోనే. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షురాలి భారత పర్యటన వివరాలను కూడా మొదట రూబియో వెల్లడించారు. భారత్, వెనెజువెలా ఈ వార్త గురించి కనీసం సూచన కూడా ఇవ్వలేదు. ఇరు దేశాలు ధ్రువీకరించక రూబియో ప్రకటించారు. ఇది కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రమే కాదు. పెద్ద దౌత్య ధోరణికి సంకేతం' అని జైరాం రమేశ్ అన్నారు.
వచ్చే వారం దిల్లీలో జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రారంభోత్సవానికి వెనెజువెలా అధ్యక్షురాలు హాజరు కావాల్సి ఉందని జైరాం రమేశ్ తెలిపారు. కానీ, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి కారణంగా దీనిని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందని పేర్కొన్నాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన సమయం, తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ, భారత విదేశాంగ విధానంలో అమెరికా పాత్ర ఎంతవరకు ఉందని ప్రశ్నించారు. భారత విదేశాంగ విధానం కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఇంకా ఏమి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? అంటూ జైరాం రమేశ్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
భారత్ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన మార్కో రూబియో, భారత్తో ఇంధన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే ఆసక్తి అమెరికాకు ఉందని చెప్పారు. భారత్ ఎంత ఇంధనం కొనుగోలు చేస్తే అంత అమ్మేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అని వ్యాఖ్యానించారు. భారత్ ప్రస్తుతం ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రశంసించిన ఆయన, వెనెజువెలా చమురు విషయంలో కూడా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే సందర్భంలో డెల్సీ రోడ్రిగ్జ్ భారత పర్యటనను ప్రస్తావించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi