
కామారెడ్డి, 22 మే (హి.స.)
జుక్కల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ
ఇండ్లు 3000 మంజూరు కాగా రెండేళ్లలో కేవలం 9 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగతా 90% ఇళ్లు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హౌజింగ్ అధికారులపై ఫైర్ అయ్యారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన ఇసుక, మొరం తెచ్చుకుంటున్న లబ్ధిదారులపై కేసులు పెడుతూ దొంగలను మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను మానవతా దృక్పథంతో చూడాలని, వారికి కావాల్సిన, ఇసుక, మొరం తెచ్చుకునేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. ఇసుక, మొరం తీసుకు వెళుతున్న లబ్ధిదారులను మానవతా దృక్పథంతో వదిలేయాలని పోలీసులను కోరినప్పటికీ వారి పైన కేసులు పెట్టడం శోచనీయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో లబ్దిదారుల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు, సూచనలు ఉన్నప్పటికీ ఈ విషయం అధికారులకు కూడా తెలియకపోవడం విడ్డూరమన్నారు. అధికారులు తమ విధులను ఐదు గంటల వరకు పని చేయాల్సి ఉన్నప్పటికీ, వాళ్లు ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయకున్నప్పటికీ పని చేసిన సమయంలో ప్రజలు సంతృప్తి చెందేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. గరీబోళ్లు, ప్రజల సమస్యలపై మాట్లాడితే కాంట్రవర్సీ అనుకుంటే తాను ప్రతిరోజు కాంట్రవర్సీనే మాట్లాడతానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు