
చిత్తూరు, 22 మే (హి.స.) సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23న యాదమరి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా యాదమరి పీహెచ్సీలో 'సంజీవని హెల్త్ ప్రాజెక్టు'తో పాటు మహిళల కోసం 'కల్యాణలక్ష్మి' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, బహిరంగ సభ, పీహెచ్సీ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలన్నారు. ప్రజా వేదికకు వచ్చే ప్రజల కోసం తాగునీరు, నిరంతర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. పర్యటనకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను శుక్రవారంలోగా పూర్తి చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV