
అమరావతి, 22 మే (హి.స.)
ఇవాళ జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు ‘చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ ఇవ్వొచ్చనిపించిందని, ఆయన అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, జగన్పై, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత కుటుంబాన్నే కాకుండా, సొంత జిల్లాను, నియోజకవర్గాన్ని కూడా జగన్ మోసం చేశారని ఆరోపించారు.
జగన్ కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తల్లిని, చెల్లిని తరిమేశారని, బాబాయిని లేపేసి మరో చెల్లి కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలి వేటు అని బయటకు వచ్చింది. ఆ తర్వాత దొంగ పేపర్లో నారాసుర రక్తచరిత్ర అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫోటో వేశారు. కానీ, జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైంది. అందుకే వైసీపీకి ముద్దుగా గొడ్డలి పార్టీ అని పేరు పెట్టాం అని లోకేష్ అన్నారు.
జగన్ నటన చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుందని, బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోట్లు వేయడం ఆయనకు అలవాటని వ్యాఖ్యానించారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని, రియల్ ఎస్టేట్ వ్యాపారి దస్తగిరిని జగన్ మేనమామ చంపేసి, తమపై కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదని, ఇప్పుడు కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు. కడపలో ఒక పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నారని, త్వరలో ఆయన సమయం కూడా వస్తుందని, చట్టాలను ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi