
అమరావతి 22 మే (హి.స.)
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై జనసేన పార్టీ నేతలు కేసులు పెడుతుండడంపై సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ను అరెస్ట్ చేయిస్తే ఆయన ఏకంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారని, దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న 'కాక్రోచ్ ఉద్యమం' ఇక్కడ కూడా ఉప్పెనలా మారుతుందని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోందని నారాయణ పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ప్రొఫెసర్ను భయపెట్టాలని చూసే 'బ్లాక్మెయిల్' రాజకీయమేనని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో అయినా, బయట అయినా ఎవరి వాదనలు, అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని.. ప్రజాస్వామ్యంలో దానికి సమాధానం కూడా వాదనతోనే ఇవ్వాలి తప్ప, ఇలా వరుసగా కేసులు పెట్టడం బెదిరింపులకు పాల్పడటమే అవుతుందని నారాయణ వ్యాఖ్యానించారు.
సమాజంలో తమకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లను అణచివేయాలని చూస్తే.. 'కాక్రోచ్ లు' అన్నీ బయటకు వస్తాయని నారాయణ హెచ్చరించారు. మీరు బ్లాక్మెయిల్ చేయడం మానుకుని, ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి. నిజానికి ఆయన అరెస్ట్ అవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గనుక అరెస్ట్ అయితే.. ఒక పవర్ఫుల్ సీఎం క్యాండిడేట్గా బయటకు వస్తారు అని నారాయణ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi