
కామారెడ్డి, 22 మే (హి.స.)
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చెరువులు, వాగుల్లో నుంచి మొరం, ఇసుక తెచ్చుకునేటప్పుడు పోలీసులు, అధికారులు కేసులు పెడితే సహించేది లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను కేంద్రబిందువుగా తీసుకొని పారదర్శక పరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
కేవలం సమీక్ష సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాల్లో కనిపించే మార్పుగా మారాలన్నారు. ప్రతి శాఖకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందని, వాటి అమలులో వేగం పెంచాలని సూచించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఉండాలని, సమయపాలనతో పనులు పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు