సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..
సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..
Murder


సూర్యాపేట, 23 మే (హి.స.)

సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో మరోసారి రాజకీయ కక్ష్యలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ మర్డర్ జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో యర్కారం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద గోనెసంచిలో కట్టి ఉంచిన డెడ్ బాడీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మధు హత్య కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మృతదేహం లభించిన ఘటన స్థలాన్ని, అలాగే ప్రభుత్వాసుపత్రి మార్చురిని శనివారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, హంతకులను త్వరలోనే అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మధు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. అనంతరం ఆయన ఆచూకీ తెలియకపోవడంతో భార్య సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్కారం గ్రామ శివారులో రోడ్డుపక్కన ఉన్న కల్వర్టు కింద గోనె సంచిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలిపారు. గోనె సంచిలో లభించిన మృతదేహం యర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధుదేనని బంధువుల ద్వారా నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తును సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ నిర్వహిస్తుండగా, డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

హత్య కేసులో నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, బెయిల్ రాకుండా జైలులోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. టెక్నికల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరించి కేసును బలంగా కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, భౌతిక దాడులు, హత్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ, జిల్లాలో గతంలో జరిగిన పలు హత్య కేసుల్లోనూ నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు సమర్థంగా దర్యాప్తు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అనంతరం ఎస్పీ నరసింహ పోలీసు సిబ్బందితో కలిసి మృతదేహం లభించిన సంఘటన స్థలాన్ని పరిశీలించి కీలక వివరాలు సేకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande