
అమరావతి, 23 మే (హి.స.)
ఏపీలో పర్యాటక పోలీసు విధానంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకుల స్వర్గధామంగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టారు. దీనికి సంబంధించి సచివాలయంలో పర్యాటక, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
:సందర్శకులకు పూర్తి భద్రత కల్పించే లక్ష్యంతో నూతనంగా పర్యాటక పోలీసు విధానాన్ని తీసుకురానున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీనిపై త్వరలో క్యాబినెట్లో చర్చిస్తామని పవన్ ప్రకటించారు. నాలుగు శాఖలతో కూడిన ఉమ్మడి కమిటీని వేసి, 200 అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో సుమారు 50 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల తరహాలో మన గ్రామాలకు పర్యాటక శోభను తీసుకువచ్చి, పర్యాటకులకు ఇళ్లలోనే బస చేసే సదుపాయాలు కల్పించేలా కొన్ని పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలని వివరించారు. అదే విధంగా కర్నూలులో కృష్ణ జింకలు, నల్లమలలో బైర్లూటి, నెల్లూరులో ఫ్లెమింగో పక్షుల కేంద్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
అధికారులకు దిశానిర్దేశం:పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన రూట్ మ్యాప్లు, వసతుల పూర్తి వివరాలతో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించి, టూరిజం సర్క్యూట్ ప్యాకేజీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుని, భక్తుల దైవదర్శనంతో పాటు సమీప ప్రకృతి ప్రాంతాలను కూడా కలుపుతూ వినూత్నంగా కాంబో టూరిజం ప్యాకేజీలు డిజైన్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లేందుకు జూన్ 10వ తేదీలోపు అటవీ, పర్యాటక శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గడువు నిర్దేశించారు.
మరికొన్ని:ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్దఎత్తున నిధులు కేటాయించారు. ప్రసాద్ పథకం కింద రూ. 25 కోట్ల 32 లక్షలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi