
హైదరాబాద్, 23 మే (హి.స.)
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పరిస్థితుల నేపథ్యంలో మంత్రి శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించి, ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఏడు జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు వడదెబ్బ మృతు కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయిల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంటోంది. తీవ్రస్థాయి ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని మీడియా, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రకటనల ద్వారా ఎండలపై అప్రమత్తత కల్పించాలని ప్రజలకు అవసరమైన సమాచారం ప్రతి గంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని అని అధికారులను ఆదేశించారు. బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ హీట్ వేవ్ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని మండల స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్లో ఉండాలని ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..