
గుంతకల్ (ఏ.పీ,) 23 మే (హి.స.)
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి
కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోడీ 3.0 పాలనలో దక్షిణ భారతదేశంలో కేంద్రం నుండి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అందులో భాగంగా గత రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసుకోగలిగామని, కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటంవల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సైతం మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే భావనలో ఉన్నారని తెలిపారు. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన 'రోజ్ గార్ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా 120 మంది అభ్యర్థులు ఉద్యోగ అపాయిట్ మెంట్ లెటర్లను అందుకున్నారు.
10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో 2022 అక్టోబర్ 22న రోజ్లర్ మేళాను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించినప్పుడు ఇది జరిగే పనేనా? అని చాలా మంది హేళన చేశారని వాటిని పట్టించుకోకుండా అవినీతి, పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని ఇది మోడీ కమిట్ మెంట్కు నిదర్శనం అన్నారు. 19వ విడత ద్వారా 47 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళా ద్వారా మరో 51 వేల ఉద్యోగాల భర్తీ చేసి నియామక పత్రాలు అందించామన్నారు. గతంలో లీకేజీలు, పైరవీలకు, దళారుల ప్రమేయంతో ఉద్యోగాలిచ్చేవారు. మోడీ మెరిట్ ఆధారంగా అర్హులైన వారినే ఉద్యోగాలు వరిస్తున్నాయని చెప్పారు. రోజ్ గార్ మేళాను నిరంతరం కొనసాగించాలని భావిస్తున్నామని, కర్మయోగి పోర్టల్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారంతా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు