
హైదరాబాద్, 23 మే (హి.స.)
హైదరాబాద్ నగరంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. భానుడి భగభగ కారణంగా నగరంలో తాగునీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో జలమండలి నీళ్ల ట్యాంకులకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు.
నగరంలో మే నెల మొదటి 20 రోజుల్లో సుమారు 2.60 లక్షల ట్యాంకర్ల నీటిని సరఫరా చేసినట్లు జలమండలి తెలిపింది. ప్రస్తుతం వారం రోజులుగా రోజుకు సగటున 12 వేలకు పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎక్కువ ట్యాంకర్లకు డిమాండ్ ఉండేది. మే నెలలో కాస్త తగ్గేది. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా మే నెలలో ఎక్కువ ట్యాంకుల కోసం బుక్ చేసుకున్నారు.
ఇటీవల గ్యాస్ సిలిండర్ కొరత భయాలతోనూ ప్రజలు గ్యాస్ కోసం వేగంగా బుకింగ్ చేసి, ఇంట్లో భద్రపరుచుకున్నారు. అదనపు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేయడంతో అవసరమైన వారికి దొరకకుండా పోయింది. ఇప్పుడు ఇదే కోవలో హైదరాబాద్లో నీటిని కూడా ముందస్తుగా బుకింగ్ చేసి భద్రపరుచుకుంటున్నారు. కొంతమంది అవసరం లేకపోయినా ట్యాంకర్లను బుక్ చేసుకుని నీటిని నిల్వ చేసుకుంటున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నీటి కొరత, ట్యాంకర్ల బుకింగ్లో అత్యధికస్థాయికి చేరుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi