
అనంతపురం , 23 మే (హి.స.)
అనంతపురం నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు నెల రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. నగరంలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం సూర్యనగర్ రోడ్డు, ఐదవ సర్కిల్ మస్టర్ పాయింట్, గుత్తి రోడ్డు బస్ స్టాప్ ప్రాంతాల్లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 30 రోజుల పాటు నాలుగు వారాల ప్రత్యేక ప్రణాళికతో రోడ్లు, డ్రైన్లు, మార్కెట్లను పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతి ప్రాంతంలో చెత్త సేకరణకు ఎప్పుడు వాహనాలు వస్తాయి, ఎవరు బాధ్యత వహిస్తారు అనే వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించి, నిర్ణీత సమయాల్లోనే చెత్త అందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు.
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ, గత మూడు నెలలుగా నగర పరిశుభ్రతలో కొంత మార్పు వచ్చిందని, అయితే పూర్తి స్థాయిలో శుభ్రత సాధించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపడతామని చెప్పారు. ప్రజల సహకారం ఉంటేనే పరిశుభ్రమైన అనంతపురం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV