
ఢిల్లీ 24 మే (హి.స.)
భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకం కింద 50 పారిశ్రామిక పార్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రాలకు 4 నెలల గడువు ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శనివారం (మే 23) నుంచి రానున్న నాలుగు నెలల్లోగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దరఖాస్తులను సమర్పించొచ్చన్నారు. ఇందులోని 20 పారిశ్రామిక పార్కులకు తొలి రెండు నెలల్లో, మిగతా 30 పారిశ్రామిక పార్కులకు తదుపరి రెండు నెలల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. భవ్య పథకం తొలిదశలోనే ఈ మొత్తం 50 పారిశ్రామిక పార్కులకు అనుమతులను మంజూరు చేస్తామని, మిగతా 50 పార్కులకు తదుపరి దశలో అనుమతులు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటురంగ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో ఈ స్కీం అమలవుతుందని పీయూష్ గోయల్ చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈవివరాలను ఆయన చెప్పారు.
భవ్య స్కీంలో భాగంగా 100 నుంచి 1000 ఎకరాల్లో ఉండే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి కోసం చేపడతామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దీనికి ఎంపికయ్యే పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో 25 ఎకరాల్లో ఉండే పారిశ్రామిక పార్కులనూ భవ్య స్కీంకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ పథకానికి కేంద్రం కేటాయించిన రూ.33,660 కోట్ల నిధులను, వీటితో ముడిపడిన ప్రాజెక్టులను దక్కించుకోవడానికి రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయని పీయూష్ గోయల్ అన్నారు. భూమి, నీరు, విద్యుత్ వంటి మెరుగైన సౌకర్యాలను కల్పించే రాష్ట్రాలే పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్ర, బంగాల్, హరియాణా వంటి రాష్ట్రాలు భవ్య స్కీంపై తీవ్ర ఆసక్తిని చూపుతున్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi