
కుప్పం , 24 మే (హి.స.)
కుప్పం పట్టణంలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది.మనుషుల పైనే కాదు పశువుల పై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. వీధికుక్కలు చిన్నారుల మీదకు కూడా ఎగబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మర్రిమాను వీధి, ప్యాలెస్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేసి కరిచింది. ఈ ఘటనలో సుమారు 16 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్క భయంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పిచ్చి కుక్కలను పట్టుకోవడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన పరిష్కారం రాలేదని ఆవేదన చెందుతున్నారు. శునకాల దాడులతో తీవ్ర భయాందోళన చెందుతున్నామని వాపోయారు. తమ ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిచ్చి కుక్కల దాడులపై ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శునకాల దాడులు ప్రతిరోజూ పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని ప్రజలు హెచ్చరించారు. అధికారులు త్వరగా పిచ్చి కుక్కలను పట్టుకోవాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV