
ఢిల్లీ, 24 మే (హి.స.)
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కుటుంబసమేతంగా భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో సుమారు 20 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగమైన, చిరస్మరణీయమైన ఘట్టమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రధాని మోదీ ఆయన తల్లి విజయకుమారి వద్ద ప్రశంసించారు. చాలా మంది నాయకుల పిల్లలు సరిగా పనిచేయలేకపోతున్నారు. మీరు మాత్రం మీ కుమారుణ్ని చూసి గర్వపడాలి. చిన్న వయసులో మంత్రిపదవి వచ్చినా కష్టపడి పనిచేస్తూ.. అందరి మెప్పు పొందుతున్నారు అని ప్రధాని అన్నారు.
ఈ భేటీలో రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి అరసవల్లి సూర్యనారాయణ స్వామి విగ్రహంతో పాటు, ప్రసిద్ధి చెందిన పొందూరు ఖద్దరును బహూకరించారు. ఆయన తల్లి విజయకుమారి 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమం స్ఫూర్తితో ప్రధానికి ఒక మొక్కను అందజేశారు. అనంతరం, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, సీఎం చంద్రబాబు సందేశాన్ని ప్రధానికి రామ్మోహన్ తెలియజేశారు. దీనిపై తేదీలను పరిశీలించి తెలియజేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు 'ఎక్స్' వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రధాని ఆప్యాయత, ఆయన వ్యక్తిత్వం తమ కుటుంబంలోని మూడు తరాల వారిని ఆకట్టుకుందని, ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi