
ఢిల్లీ, 24 మే (హి.స.)
మాజీ మోడల్, నటి ట్విష శర్మ (33) అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో సంస్థాగత పక్షపాతం, విధానపరమైన లోపాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసిన సర్వోన్నత న్యాయస్థానం, మే 25న విచారణ జరపనున్నట్లు ప్రకటించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్లు జాయ్ మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అత్తింటిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో సంస్థాగత పక్షపాతం, దర్యాప్తు లోపాలపై అనే పేరుతో ఈ కేసును నమోదు చేశారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల కటారా హిల్స్ ప్రాంతంలోని అత్తింటిలో మే 12న ట్విష శర్మ ఉరివేసుకుని కనిపించిన విషయం తెలిసిందే. వివాహమైన ఐదు నెలలకే ఆమె మృతి చెందడంతో, వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi