ఇండ్ల కేటాయింపులో మధ్యవర్తుల ప్రమేయాన్ని సహించేది లేదు: మంత్రి తలసాని
తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస) రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్
ఇండ్ల కేటాయింపులో మధ్యవర్తుల ప్రమేయాన్ని సహించేది లేదు: మంత్రి తలసాని


తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస)

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో రెవెన్యూ, జీహెచ్ఎంసి, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్డీవో లు వసంత, వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఎస్ఈ కిషన్, ఈఈ వెంకటదాసు రెడ్డి, SC, ST, BC, మైనార్టీ కార్పోరేషన్ రమేష్, కమలాకర్, ఆశన్న, ఖాసీం పలువురు తహసీల్దార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మీ కార్యాలయాలకు వచ్చినప్పుడు సమస్యలపై సత్వరమే స్పందించాలని ఆదేశించారు. వారంలో రెండు రోజుల పాటు అదేవిధంగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, జెఎన్ఎన్యుఆర్ఎం క్రింద నిర్మించిన ఇండ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఇండ్ల కేటాయింపులో మధ్యవర్తుల ప్రమేయాన్ని సహించేది లేదన్నారు. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 ప్రాంతాలు, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 ప్రాంతాలలో జెఎన్ఎన్యుఆర్ఎం క్రింద 3,422 ఇండ్లను నిర్మించగా అందులో 2,158 ఇండ్లను లబ్దిదారులకు కేటాయించడం జరిగిందని చెప్పారు.

ఇంకా 1264 ఇండ్ల కేటాయింపు పెండింగ్ లో ఉందని అన్నారు. ఆర్డీవో లేదా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో తగు విచారణ జరిపి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని గుర్తించి 10 రోజులలోగా మిగిలిన ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, వాటిని కూడా పూర్తిస్థాయిలో లబ్దిదారులకు కేటాయించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

సంబంధిత తహసిల్దార్ లు తమ తమ పరిదిలలో క్షేత్రస్థాయిలో తగు విచారణ జరిపి 10 రోజులలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటి సమగ్ర సమాచారంతో నివేదికను రూపొందించి నెల రోజులలో అందజేయాలని తహసిల్దార్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధి రాంగోపాల్ పేటలో గల గైదన్ బాగ్ లో సరైన సౌకర్యాలు లేక, ఇరుకు ఇండ్లలో నిరుపేదలు నివసిస్తున్నారని మంత్రి చెప్పారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు 4 రోజులలో సమగ్ర సర్వే నిర్వహించి ప్రణాళికలను సమర్పించాలని సికింద్రాబాద్ ఆర్డీవో వసంత, తహసిల్దార్ బాల శంకర్ లను ఆదేశించారు.

జీహెచ్ఎంసి దేవాదాయ శాఖ, రెవెన్యూ స్థలాలకు సంబంధించి పలు కేసులు కోర్టులలో సంవత్సరాలుగా సాగుతున్నాయని, ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అంబేడ్కర్ నగర్, బండ మైసమ్మ నగర్ తదితర ప్రాంతాలలో కోర్టు కేసుల కారణంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని, వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించి ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

నాలాల వెంట అక్రమంగా ఇండ్లను నిర్మించుకొని నివసిస్తున్నారని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు సిద్దంగా ఉందని మంత్రి వివరించారు. నాలాల వెంట నివసిస్తున్న వారికి ఈ విషయంపై అవగాహన కల్పించి ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, లబ్దిదారుల ఎంపిక తదితర సమాచారం ఎంఎల్ఏ లు, ఎంఎల్సీ లు, ఇతర ప్రజాప్రతినిధుల కు ఖచ్చితంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande