ఢీల్లీ, 20 నవంబర్ (హిం.స)
జాతీయ రహదారిలో భాగంగా నిర్మిస్తున్న ఓ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంస్థలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి.
వారం రోజులకు పైగా టన్నెల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికులకు నీటితో పాటు ఆహారాన్ని సహాయ బృందాలు అందించగల్గుతున్నాయి. కానీ వారిని బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. సిల్క్యారా – దండల్గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న ఈ టన్నెల్ నవంబర్ 12న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
నిర్మాణ పనుల్లో ఉన్న 41 మంది కార్మికులు టన్నెల్ లోపలి భాగంలో చిక్కుకుపోయారు. వారు బయటికొచ్చేందుకు మార్గం లేకుండా పోయింది. కార్మికులను రక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సహాయ బృందాలు రంగంలోకి దిగి తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
రెస్క్యూ పనులపై ప్రధాని ఆరా
ఉత్తరకాశీ టన్నెల్ దుర్ఘటనపై ప్రధాని కార్యాలయం స్వయంగా రంగంలోకి దిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి కార్మికుల యోగక్షేమాల గురించి ఆరా తీశారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా