ఏ.పీ, 23 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ తన రాజీనామా లేఖను ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజుకు పంపించారు. ఎమ్మెల్సీ పదవితో పాటుగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ ప్రకటించారు.మరోవైపు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ.. గతేడాది వరకూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కు ఏడాది ముందు జయమంగళ వెంకటరమణ టీడీపీని వీడారు. 2023 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన జయమంగళ వెంకటరమణ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..